వైద్య విద్యా ప్రమాణాల నిర్వహణలో సంస్కరణల ఆవశ్యకత


కాకినాడ: వైద్య విద్యా ప్రమాణాల నిర్వహణలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని ఎన్‌.టి.ఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హైల్త్‌ సైన్సెస్‌ ఉప కులపతి ఇంద్రకంటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి క్యాంపస్‌లోని లెక్చరర్‌ గ్యాలరీలో రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, జి.జి.హెచ్‌. సిబ్బంది సంయుక్తంగా నూతనంగా ఉప కులపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఐ.వి.రావుకు సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత ఐ.వి.రావు మాట్లాడుతూ తాను వైద్య పరంగా చేసిన సేవలకు గుర్తింపుగా ముఖ్యమంత్రి, గవర్నర్‌, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీలు ఉప కులపతిగా నియమించడం జరిగిందన్నారు. గత 30 సంవత్సరాలుగా రంగరాయ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌, జి.జి.హెచ్‌.లో సూపరింటెండెంట్‌గా అందరి సహకారంతో నిరుపేదల అనారోగ్య సమయాల్లో వైద్య సేవలందించడం ద్వారా వైద్య వ్యవస్థ బలోపేతానికి కృషి చేయడం జరిగిందన్నారు. వైద్య వృత్తి పరంగా టీచింగ్‌ వృత్తిలో ఎంతో అనుభూతిని పొందానని, అలాగే జి.జి.హెచ్‌. ద్వారా నిరుపేదలకు ఆరోగ్య సేవలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కృషి చేయడం జరిగిందన్నారు. అందరి కృషి మూలంగా అన్ని విధాగాల్లో కొత్త యూనిట్లు నెలకొల్పడం ద్వారా ఆసుపత్రి బలోపేతం అయిందని, మెరుగైన వైద్య సేవలు అందించు నిమిత్తం ఇంకా పై స్థాయికి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు, శ్రేయోభిలాషుల ఆశీస్సులు, భగవంతుని దీవెనలతో సమర్థవంతంగా అంకిత భావంతో పని చేసి ఈ స్థాయికి ఎదిగానన్నారు. దివంగత వై.యస్‌.ఆర్‌. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పధకం అమలులో దీర్ఝకాలం పాటు పరిశోధన చేసి పధకం రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నానన్నారు. ఈ స్కీమును ప్రస్తుత ముఖ్యమంత్రి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, డయాలసిస్‌ యూనిట్‌ ద్వారా రోజూ 30 మంది రోగులు ఆరోగ్యశ్రీ క్రింద వైద్య సేవలు పొందుతున్నారన్నారు. అలాగే క్యాన్సర్‌ యూనిట్‌ నెలకొల్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఊహించిన స్థాయిలో కష్టపడి పని చేసి వివిధ అంశాలలో యూనివర్సిటీకి వన్నె తేవడానికి కృషి చేస్తానన్నారు. న్యూఢిల్లీలో కొత్తగా వ్యాప్తి చెందిన బ్యాక్టీరియా వల్ల ఎటువంటి ప్రమాదం లేదని విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్‌.టి.ఆర్‌. యూనివర్సిటీ పరిధిలో 35 వైద్య కళాశాలల్లో డెంటల్‌, ఫార్మాస్యూటికల్స్‌, నర్సింగ్‌ కోర్సులున్నాయని, వీటిలో కొత్తగా ఏ కోర్సులు ఉపయోగపడతాయో కూలకషంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. స్టెమ్‌ సెల్‌ థెరఫీపై ఆలోచన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఉప కులపతిగా పని చేసిన కృష్ణంరాజు యూనివర్సిటీ అభివృద్దికి చాలా కృషి చేశారన్నారు. ప్రస్తుతం షుగర్‌ వ్యాధి వ్యాప్తి 15 నుండి 20 శాతానికి పెరిగిందన్నారు. కిడ్నీ వ్యాధులపై రిసెర్చ్‌ చేసేందుకు వీలుగా ఆసుపత్రిలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ సీట్లు పెరిగాయని తద్వారా రోగులకు ఎక్కువ సేవలు లభ్యమవుతున్నాయని ఆయన అన్నారు. జి.జి.హెచ్‌.లో ఇంకా వనరులు సమకూర్చుకోవాల్సి ఉందన్నారు. పరిశోధనల కోసం యూనివర్సిటీ ద్వారా తమ సహకారం అందిస్తామన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మాట్లాడూతూ స్వాతంత్ర్య సమయోధులను స్పూర్తిగా తీసుకుని పారిశ్రామికీకరణ, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఎం.బి.ఆర్‌.శర్మ మాట్లాడుతూ ఐ.వి.రావు సేవలు వైద్య వ్యవస్థలో లిఖించదగ్గవని, వారి కుటుంబం వైద్య రంగంలో ఉన్నత పదవుల్లో కొనసాగుతోందన్నారు. స్థానిక పి.ఆర్‌. హైస్కూలులో విద్యాభ్యాసం ప్రారంభించి ఆంద్రా మెడికల్‌ కళాశాలలో ఎం.బి.బి.ఎస్‌., ఎం.డి.(జనరల్‌) కోర్సులు పూర్తి చేశారని, విద్యాభ్యాసంలో ఎన్నో గోల్డ్‌ మెడల్స్‌ సాధించారని, ఆర్‌.యం.సి.లో ప్రొఫెసర్‌ పదవులను నిర్వహించి, జి.జి.హెచ్‌.లో సూపరింటెండెంట్‌గా క్రమశిక్షణ, అంకిత భావంతో నిరుపేదలకు వైద్య సేవలందించి పేరు ప్రఖ్యాతులు గావించారు. అలాగే ఆసుపత్రి పురోగతికి కృషి సల్పారన్నారు. ఆయన డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ పదవిలో ఉండగా జి.జి.హెచ్‌.కు 3 కోట్ల రూపాయలు అందించి పురోగతికి పాటుపడ్డారన్నారు. వైద్య వ్యవస్థలో ఎన్‌.టి.ఆర్‌. విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే అగ్ర భాగాన నిలిపేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నానన్నారు. సభకు అధ్యక్షత వహించిన ఆర్‌.యం.సి. ప్రిన్సిపాల్‌ వి.విక్రమ్‌కుమార్‌ మాట్లాడుతూ ఐ.వి.రావు కష్టపడి పని చేసి అంచెలంచెలుగా పేరు ప్రఖ్యాతులు గావిస్తూ ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు. రంగరాయ మెడికల్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా ఎనలేని కృషి చేసి అభివృద్దికి పాటుపడ్డారన్నారు. ఎ.పి.జి.డి.ఎ. అధ్యక్షులు ఎం.రాఘవేంద్రరావు మాట్లాడుతూ కష్టించి పని చేయడంలో ఆయన నిలువెత్తు ప్రతిరూపమని, వైద్య వ్యవస్థలో ప్రాముఖ్యతను సంతరింపచేయడంతో పాటు రాష్ట్ర స్థాయిలో మంచి గౌరవం కూడా సంపాదించారన్నారు. డా.ఎస్‌.పి.రమణ మాట్లాడుతూ వైద్య రంగంలో విశిష్ట స్థానం పొందడంతో పాటు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ రూపకల్పన, టీచింగ్‌ ప్రొఫెషన్‌లో పేరు ప్రఖ్యాతులు గావించారని, ఎన్‌.టి.ఆర్‌. యూవివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ను రోల్‌ మోడల్‌గా తీసుకువస్తారని ఆయన ఆకాంక్షించారు. ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు బొడ్డు వెంకటరమణమూర్తి మాట్లాడుతూ డాక్టర్లకు వృత్తి పరంగా ఉన్న గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి కృషి చేయాలని కోరారు. డా.ఐ.వి.రావు ఉన్నత స్థాయికి చేరుకోవడంలో ఆయన అర్థాంగి తోడ్పాటు ఎంతో ఉందన్నారు. ఎన్‌.జి.ఓ. సంఘం సెక్రటరీ బి.ఆశీర్వాదం మాట్లాడుతూ జి.జి.హెచ్‌. అభివృద్దికి తోడ్పడాలని కోరారు. ఐ.వి.రావుకు ఆర్థికపరమైన తపన లేదని, గుర్తింపు కొరకు ఆరాటపడే వ్యక్తని, గతంలో ఇచ్చిన సహకారాన్ని భవిష్యత్తులో కొనసాగించాలన్నారు. ఆయన ఆశయం ఆయన కృషిలోనే ప్రతిబింభిస్తుందని, ఈ సన్మానం మరింత బాధ్యతను పెంచుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.జి.డి.ఎ. సెక్రటరీ శ్రీనివాస్‌, సహాయ కార్యదర్శి డా.లక్ష్మాజీనాయుడు, జి.జి.హెచ్‌ డాక్టర్లు, ప్రొఫెసర్లు, నర్సులు, సిబ్బంది, గెదెల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: