ప్రాజెక్టు పునరావాస ప్రక్రియలను వేగవంతం చేయాలి: అధికారులను ఆదేశించిన విశాఖ జిల్లా కలక్టరు జె.శ్యామలరావు


విశాఖపట్నం: జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, పునరావాస ప్రక్రియలను వేగంగా పూర్తిచేయాలని జిల్లా కలక్టరు జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. కలక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రత్యామ్నాయ నేవల్‌బేస్‌ బాబా అణు పరిశోధన కేంద్రం అన్‌రాక్‌, ఫార్మాసిటీ, ఎపిఐఐసి ప్రాజెక్టులకు సంబంధించి భూ బదలాయింపుపై జరిగిన సమీక్షా సమావేశంలో భూ సేకరణ, బదలాయింపు, పునరావాస పేకేజిలు అమలవుతున్న తీరును గూర్చి క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్దికి అత్యంత కీలకమయిన ఈ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించాలని, వీటికి భూములు అప్పజెప్పడం, పునరావాస ప్యాకేజిలను అమలు చేయడానికి ప్రాముఖ్యత నివ్వాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులకు భూసేకరణ చేసే క్రమంలో అభివృద్దిలో ప్రజలను భాగస్వాములను చేసే ప్రక్రియ కనుక ప్రజాభీష్టం మేరకు, వారిని ఒప్పించాలన్నారు. వారికి న్యాయబద్దమైన నష్ట పరిహారాన్ని, జీవన భృతిని కల్పిస్తామనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. అన్ని శాఖల అధికార్లు సమన్వయంతో పనిచేసినట్లయితే సులభంగా పనులు పూర్తవుతాయన్నారు. ఎస్‌.రాయవరం మండలం లో నిర్మించ తలపెట్టిన నేవల్‌ బేస్‌ భూసేకరణపై సమీక్షిస్తూ మత్స్యకారుల సర్వే వెంటనే పూర్తిచేయాలన్నారు. మత్స్యకారులందరిని గుర్తించి వారికి గుర్తింపు కార్డులు జారీచేయాలన్నారు. భూసేకరణ చేసిన గ్రామాల ప్రజలందరికీ ఆర్‌.ఆర్‌. పేకేజిని అమలు చేయాలని, వారందరికి ఇళ్లస్థలాలివ్వాలని ఆర్డీవో, మత్స్య శాఖ అధికార్లను ఆదేశించారు. బాబా అణు పరిశోధనా కేంద్రానికి సంబంధించి ఎర్రనాయుడు పాలెం, జోగన్నపాలెం గ్రామాలవారికి ఇస్తున్న నష్ఠపరిహారాన్ని త్వరగా పూర్తిచేయాలన్నారు. వారికి కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే వారికి అప్పగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్‌రాక్‌, ఫార్మా సిటీలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు. నష్ట పరిహారం చెల్లించిన వారిని వెంటనే ఖాళిచేయించి సంబంధిత సంస్థకు భూములు అప్పజెప్పాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో వున్న సమస్యలు ప్రజలతో, ప్రజా ప్రతినిధుల సమక్షంలో చర్చించి అందరికీ ఆమోద యోగ్యమైన విధంగా పరిష్కరించాలని రెవెన్యూ, పరిశ్రమల శాఖ అధికార్లను ఆదేశించారు. ప్రభుత్వానికి నివేదించ వలసిన సమస్యలను కలక్టరు, జాయంట్‌ కలక్టర్‌ ల దృష్ఠికి తీసుకు రావాలని, మిగిలిన సమస్యలను ఆర్డీవో, ఉప కలక్టరు స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో జాయంట్‌ కలక్టరు పోలభాస్కర్‌ , జిల్లా రెవెన్యూ అధికారి డి.వెంకటరెడ్డి, నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఎమ్‌.వి.గోవిందరాజులు, నావల్‌ అధికారి కెప్టెన్‌ సివియమ్‌ రావు, ప్రత్యేక ఉప కలక్టర్లు ఎమ్‌.బి.కామేశ్వరరావు, యుసిజి నాగేశ్వరరావు, చిరంజీవి, మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు సుదర్శన్‌, పశు సంవర్ధక శాఖ జె.డి. సింహాచలం, ఎపిఐఐసి, బ్రాండిక్స్‌, బార్క్‌, అన్‌రాక్‌ , ఫార్మాసిటీ అధికార్లు, అచ్యుతాపురం, పరవాడ మండల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: