సాహిత్య, సంస్కృతులకు ప్రతీక రాయల


కాకినాడ: తెలుగు సాహిత్యం, సాంస్కృతిక రంగాల్లో ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలు ఆచంద్రతారార్కం నిలిచి ఉంటాయని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఎం.రవిచంద్ర పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ ఐడియల్‌ కళాశాలలో జాతీయ సంస్కృతీ వారసత్వ సంస్థ (ఇన్‌టాక్‌) జిల్లా శాఖ, ఆ కళాశాల తెలుగు భాషా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రారంభోపాన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా సంస్కృతీ, సాహిత్య సేవా రంగాలలో విశేష సేవలు అందించిన రాయల 500వ పట్టాభిషేక ఉత్సవాలను ఇక్కడ నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు 20 సంవత్సరాలే పరిపాలన సాగించినప్పటికీ ఆ సమయంలో ఆయన పరిపాలనాపరంగానూ సాహిత్య, సంస్కృతీ సేవల పరంగానూ అద్భుతమైన సేవలు అందించి అవి ఆచంద్రతారార్కం నిలిచి ఉండే విధంగా చేశారని అన్నారు. ఒక వైపు సుస్థిర సామ్రాజ్య విస్తరణతో పాటు ఇతర రాజ్యాల దాడుల నుండి రాజ్యాన్ని కాపాడుకుంటూ మరో వైపు తెలుగు సాహిత్యరంగాభివృద్దికి విశేష సేవలు చేశారని, ముఖ్యంగా తాను ఒక కవి పండితునిగా అనేక గ్రంధాలు వ్రాయడమే గాక అష్టదిగ్గజాలు అనే ఎనమండుగురు కవి పండితులను తన ఆస్థానంలో ఉంచుకుని తెలుగు సాహిత్య పరంగా అనేక సేవలందించారని అన్నారు. మాతృ భాషైన తెలుగును పరిపాలనలో అన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తెలుగులోనే పంపి ప్రజలందరికీ తెలిసే విధంగా అర్థమయ్యేందుకు కృషి చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్‌ రవిచంద్ర తెలిపారు. తెలుగు భాష గొప్పదనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుని దానిని మరింత అభివృద్దికి కృషి చేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు. దేశం అభివృద్ది కావాలంటే 18 నుండి 40 సంవత్సరాలలోపు యువత ఎంతో అవసరమని, అటువంటి యువత మనకు అన్ని దేశాలకంటే ఎక్కువగా ఉందని కలెక్టర్‌ పేర్కొన్నారు. రాబోవు 30 సంవత్సరాల్లో ఇండియా, అమెరికా, చైనాలతో సమానంగా అగ్రరాజ్యంగా అభివృద్ది చెందుతుందని నేడు ప్రపంచమంతా భావిస్తోందని ఆందుకు యువత ఎంతో దోహదపడనుందని అన్నారు. 1935 ఫిబ్రవరి 2వ తేదీన బ్రిటిష్‌ పార్లమెంట్‌లో లార్డ్‌ మెకాలే తెలుగుభాష గొప్పదనం గురించి మాట్లాడం జరిగిందని ఆ ప్రసంగం గురించి తెలుసుకుంటే చాలా బాగుంటుందని ఆయన చెప్పారు. జిల్లాలోని వివిధ పురాతన దేవాలయాలు, కట్టడాలను పరిరక్షించేందుకు అపిట్‌కో అనే సంస్థ ద్వారా సర్వే చేయించడం జరుగుతోందని, ఆ నివేదిక రాగానే దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపి తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రవిచంద్ర పేర్కొన్నారు. మన తెలుగు సంస్కృతీ, సాహిత్య సాంప్రదాయాలను పరిరక్షించేందుకు విద్యార్థులు, యువత ముందుకు రావాలని ఆయన సూచించారు. నిత్యం వివిధ విషయాలను తెలుసుకోవాలని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐడియల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.చిరంజీవినీకుమారి మాట్లాడుతూ తెలుగు సాహితీ సౌరభాలు విరజిల్లేందుకు శ్రీకృష్ణదేవరాయలు చేసిన సేవలు మరువరానివని అన్నారు. తెలుగు భాష అభివృద్దికి కన్నడివాడైన రాయలతో పాటు విదేశీయులైన మెకంజీ, సి.పి.బ్రౌన్‌ వంటి వారు విశేష సేవలు అందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో 8 కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని, వారంతా తెలుగు భాష గురించి పూర్తి అవగాహన ఏర్పరుచుకోవాలని అన్నారు. జిల్లా ఇన్‌టాక్‌ తగిన చర్యలు తీసుకుంటోందని ఇప్పటికే భావన్నారాయణస్వామి దేవాలయాన్ని, బ్రహ్మ సమాజాన్ని పరిరక్షించేందుకు కృషి చేయడంతో పాటు రాజమండ్రిలోని దామెర్ల ఆర్ట్‌ గ్యాలరీలోని కొన్ని పెయింటింగ్‌ల పరిరక్షణకు చర్యలు తీసుకోవడమైందని తెలిపారు. ఉన్నత పాఠశాలల్లో హెరిటేజ్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని వాటిలో విద్యార్థులందరూ చేరాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకరరావు, తెలుగు భాషా సంఘం కన్వీనర్‌ కె.రామచంద్రారెడ్డి, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కొల్లూరి సూర్యనారాయణ, కళాశాల అధ్యక్షులు ఎన్‌.ఎస్‌.ఆర్‌. శాస్త్రి, జ్యోతుల సీతారామమూర్తి ఇంకా పలువురు ఇన్‌టాక్‌ సభ్యులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: