విద్యాశాఖ ప్రక్షాళనకు చర్యలు


గుంటూరు: రాష్ట్ర విద్యాశాఖ ప్రక్షాళనకు త్వరలో నూతన సంస్కరణలను తీసుకురానున్నట్లు రాష్ట్ర మాధ్యమిక విద్యా శాఖ మంత్రి డి.మాణిక్య వరప్రసాద్‌ వెల్లడించారు. 2010 మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల సన్మానమహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా విద్యాశాఖ, రాజీవ్‌ విద్యా మిషన్‌ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగింది. ప్రముఖ విద్యావేత్త అయిన కృష్ణ కుమార్‌ నేతృత్వంలో వారం, 10 రోజులలో ఒక కమిటీని నియమించి నూతన సంస్కరణలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని ఆయన తెలిపారు. విద్యాశాఖ పటిష్టవంతంగా పనిచేయడానికి, పరీక్షా విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు అవసరమైన సూచనలను, సలహాలను కమిటీ అందిస్తుందన్నారు. రాజీవ్‌ మాధ్యమిక శిక్షా అభయాన్‌ క్రింద రాష్ట్రంలోని ప్రతి ఉన్నత పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రస్తుత విద్యా సంవత్సరంలో 8 వందల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు మంత్రి వరప్రసాద్‌ వెల్లడించారు. ఈ పధకం క్రింద ప్రతి పాఠశాలలో 36 లక్షల రూపాయలతో తగిన సదుపాయాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అలాగే సుమారు 12వేల పాఠశాలలకు పక్కా భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి తెలియజేశారు. ప్రతి ఉపాధ్యాయుడు తన వృత్తి ధర్మాన్ని సక్రమంగా పాటిస్తే మంచి సమాజాన్ని అందించగలుగుతారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియ గుంటూరు జిల్లా నుంచే నాంది పలకాలని ఆయన కోరారు. పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయుల పైనే ఆధారపడి ఉన్నదని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని మంత్రి అన్నారు. గుణాత్మకమైన విద్యను అందించడం ద్వారా ప్రతి పాఠశాలకు గుర్తింపు తీసుకురావాలన్నారు. 2011 మార్చిలో జరిగే 10వ తరగతి పరీక్షలలో అత్యధిక శాతం ఫలితాలు రాబట్టడమే కాకుండా రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాను ఉన్నత స్ధానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమిష్టిగా కృషిచేయాలని ఈ సందర్భంగా మంత్రి శ్రీ మాణిక్య వరప్రసాద్‌ కోరారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ కూచిపూడి విజయ మాట్లాడుతూ రానున్న రోజులలో మంచి ఫలితాలను రాబట్టేందుకు ఇప్పటి నుండే బోధనా పద్దతులను మెరుగుపరుచుకోవాలని అన్నారు. శాసన మండలి సభ్యులు కె.ఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ కార్పోరేట్‌ పాఠశాలల కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేయాలంటే ప్రాధమిక విద్యా స్ధాయి నుంచే పటిష్టమైన ప్రణాళికతో నాణ్యమైన విద్యను అందించవలసిన అవసరం ఉందని అన్నారు. శాసన సభ్యులు మస్తాన్‌ వలి మాట్లాడుతూ విద్యారంగానికి ప్రాధాన్యత కల్పించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఉపాధ్యాయుడు పనిచేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్‌ బి.రామాంజనేయులు మాట్లాడుతూ నూటికి నూరు శాతం సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను స్పూర్తిగా తీసుకొని ఇతర పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని కోరారు. తొలుత డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నూటికినూరు శాతం సాధించిన 37 పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను మంత్రి, తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు నటరాజేశ్వర రావు, పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ప్రసన్న కుమార్‌, రాజీవ విద్యా మిషన్‌ ప్రాజెక్టు అధికారి ఎం.డి.చైతన్య, జిల్లా విద్యా శాఖాధికారి పి. పార్వతి, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: