పార్లమెంట్‌లోనే ప్రస్తావిస్తాం: తెదేపా


న్యూఢిల్లీ: బాబ్లీ అంశంలో రాజ్యాంగ సంస్థలైన సుప్రీంకోర్టు, కేంద్ర జలసంఘం జారీచేసిన ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వంతో అమలు చేయించడంలో ప్రధాని వైఫల్యాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని తెదేపా వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ హక్కులను కాపాడడంలో ప్రధానమంత్రి ఘోరంగా విఫలమయ్యారని ఆ పార్టీ లోక్‌సభ, రాజ్యసభాపక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. పార్టీ ఎంపీలు ఎన్‌.శివప్రసాద్‌, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల నారాయణ, సుజనాచౌదరి, గుండు సుధారాణితో కలిసి వారు మంగళవారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బాబ్లీపై ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత కూడా ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించలేపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి రోశయ్య అసమర్థత వల్లే మన హక్కులను కోల్పోవాల్సి వచ్చిందని దుయ్యబట్టారు. బాబ్లీని మనమే వివాదాస్పద ప్రాజెక్టుగా అంగీకరించి లక్షల ఎకరాల భూమి ఎడారిగా మారడానికి ఆమోద ముద్ర వేసినట్లయిందన్నారు. బాబ్లీ ముమ్మాటికీ అక్రమ ప్రాజెక్టే కాబట్టి దాన్ని కూలగొట్టాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మార్చిన ఘనత రోశయ్యకే దక్కుతుందని, ఇలాంటి వ్యక్తికి పదవిలో కొనసాగే హక్కులేదని ధ్వజమెత్తారు. బాబ్లీకి ఎప్పటికైనా రాజకీయ పరిష్కారం కావాల్సిందేనని స్పష్టం చేశారు.బాబ్లీకి గేట్లు పెట్టకూడదన్న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలుచేసేలా మహారాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తేలేకపోయిందని మైసూరారెడ్డి విమర్శించారు. ఇది సమాఖ్య వ్యవస్థకు మాయని మచ్చ అని అన్నారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగితే దేశ భద్రత ప్రమాదంలో పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులనే అమలు చేయని మహారాష్ట్ర ప్రభుత్వం రేపు న్యాయస్థానం ఇచ్చే తుదితీర్పునకు కట్టుబడి ఉంటుందని ఎలా నమ్ముతామని ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపేయాలని 2007 ఏప్రిల్‌ 12న అప్పటి కేంద్ర జల వనరుల మంత్రి సైఫుద్దీన్‌సోజ్‌ మహారాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. మన్మోహన్‌లాంటి ప్రధానులున్నంత కాలం ఇలాంటి అన్యాయాలకు, అక్రమాలకు అంతం ఉండదని ఎంపీ శివప్రసాద్‌ మండిపడ్డారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: