మద్దతు ఇంకెప్పుడో..?


ఆదిలాబాద్‌: రబీలో సాగు చేసిన ధాన్యం, మొక్కజొన్న పంట చేతికి వస్తున్నాయి.. నిల్వలు ఇంటికి చేరుతున్నా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో రైతులు తక్కువ ధరతో వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మొక్కజొన్న కొనుగోలుకు గోదాంల కొరత ఉంది. కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ సిద్ధంగా ఉన్నా వాటిని నిల్వ చేసేందుకు జిల్లామొత్తంలో గోదాం ఖాళీగా లేవు. దీంతో వీరు ఒకటి రెండు కొనుగోలు కేంద్రాలకే పరిమితమయ్యారు. తప్పని పరిస్థితుల్లో అమ్ముకునే రైతులకు వ్యాపారుల నుంచి మద్దతు ధర లభించడం లేదు. నిల్వ చేసుకోలేక.. పంటను అమ్ముకోలేక అన్నదాత పరిస్థితి అడ కత్తెరలో పోకచెక్కలా తయారయ్యింది.

ధాన్యం ధర ఇలా…
రబీలో వరిసాగు తక్కువ విస్తీర్ణంలో జరిగినా ప్రస్తుత సాగు విస్తీర్ణం అంచనా మేరకు నాలుగులక్షల క్వింటాళ్ల ధాన్యం వస్తుంది. మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిన ఐకేపీ, ఎఫ్‌సీఐ ఇంకా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. పంటకు అవసరం మేరకు నీరందక.. కరెంటుకోత కారణంగా ఎకరాకు 25-30 బస్తాలు రావాల్సి ఉండగా 15-20 బస్తాలే వస్తోందని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర మేలురకం క్వింటాలుకు రూ. 930 కాగా రెండోరకానికి రూ. 900 ప్రకటించారు. ఐకేపీ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో, గత ఖరీఫ్‌లో కొనుగోలుచేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో జాప్యం జర్గడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాన్ని అవకాశంగా తీసుకొని వ్యాపారులు నేరుగా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నా మార్కెట్‌ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో తూకం రాళ్లకు బదులుగా బస్తాలనే వాడుతున్నారు. గోనె బరువు పేరిట రెండుకిలోలు అదనంగా తీసుకుంటున్నారు. మేలురకం ధాన్యానికి రూ.850కి మించి రైతులు పొందలేని పరిస్థితి నెలకొంది.

మొక్కజొన్న పరిస్థితీ అంతే..!
వరికి ప్రత్యామ్నాయంగా రైతులు పండించిన మొక్కజొన్నకు మద్దతు ధరను పొందలేక పోతున్నారు. జిల్లా సాగువిస్తీర్ణం మేరకు లక్ష క్వింటాళ్లకు పైగా మొక్కజొన్న దిగుబడులు వస్తాయని అంచనా. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడంతో ఆశించిన దిగుబడి సాధించినట్లుగా రైతులు పేర్కొంటున్నారు. పంట చేతికొచ్చినా అమ్ముకునేందుకు కేంద్రాలు తెరవకపోవడంతో ఇంట్లో నిల్వ చేసుకోలేక, అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ. 840గా ప్రకటించగా వ్యాపారులు క్వింటాలుకు రూ.720 కంటే మించి ఇవ్వడం లేదు. పైగా డబ్బులు చెల్లించేందుకు వాయిదా పెడ్తున్నారు. గత ఖరీఫ్‌లో ఐకేపీ, డీసీఎంఎస్‌ల ద్వారా కొనుగోలు చేసి సకాలంలో డబ్బులను చెల్లించడంతో రైతులు ప్రభుత్వరంగ సంస్థల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి ఆరు కేంద్రాలను మాత్రమే తెరిచారు. ఐకేపీ గుండంపల్లి, వానల్‌పాడ్‌, బన్సపల్లిలో కొనుగోలు చేస్తుండగా మార్క్‌ఫెడ్‌ సారంగాపూర్‌, నిర్మల్‌, ఖానాపూర్‌లలో కొనుగోలు చేస్తోంది. వరికి ప్రత్యామ్నాయంగా రబీపంట కింద లక్సెట్టిపేట, దండేపల్లి మండలాల్లోనూ మొక్కజొన్న సాగు చేసారు. అక్కడ నిల్వలకు గోదాంలు లేని కారణంగా కొనగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో ఆయా మండలాల రైతులు వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది.

గోదాంల కొరత
వరి ధాన్యాన్ని ఎప్పటికపుడు మిల్లులకు తరలించే వీలున్నా మొక్కజొన్న పంట కొనుగోలు చేసిన అనంతరం గోదాంలలో నిల్వ ఉంచుకోవాల్సి ఉంది. జిల్లాలోని 16 మార్కెట్‌లలో ఓపెన్‌గోదాంలు 44 ఉండగా ఆర్‌సీసీ గోదాంలు 15 ఉన్నాయి. ఇవే కాకుండా సీడబ్ల్యుసీ గోదాములున్నాయి. అయితే ఈ ఏడాది పెద్దమొత్తంలో పత్తి అమ్మకాలు జరగడంతో వాటికి సంబంధించిన బేళ్లను సీసీఐ గోదాంలలో నిల్వ చేసుకుంది. దీంతో మార్క్‌ఫెడ్‌కు గోదాంలు లభించని పరిస్థితి నెలకొంది. పొరుగు జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉండటంతో కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా గోదాంలు ఖాళీలేక కొన్ని మండలాల్లో కేంద్రాలు ప్రారంభించలేకపోతున్నారు. దీంతో ఆయా మండలాల రైతులు వ్యాపారులకే మొక్కజొన్నను అమ్ముకుంటున్నారు.

అధికారుల మాట…
రబీలో రైతులు పండించిన వరి పంటకు కనీస మద్దతుధర కల్పించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో 18 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఐకేపీ డీపీఎం లింనగ్న, మార్క్‌ఫెడ్‌ జీఎం రవీందర్‌లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కోసం 18 కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. వీటిలో కేవలం మూడు కేంద్రాలకు ప్రారంభించినట్లు తెలిపారు. మొక్కజొన్న కొనుగోలుకు ఆరు కేంద్రాలను ప్రారంభించారు. మూడు కేంద్రాల్లో డీసీఎంఎస్‌, మరో మూడుకేంద్రాల్లో ఐకేపీ కొనుగోలు చేస్తోందన్నారు. లక్సెట్టిపేట, దండేపల్లి ఏరియాలోనూ త్వరలోనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని వారు చెప్పారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: