రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణలో రాజీలేదు : సీఎం


విశాఖపట్నం: రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలలో ఒక్క చుక్క నీటిని కూడా నష్టపొకుండా తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే అంశాలలో ఎలాంటి రాజీ లేకుండా అధికారులు, వ్యూహాత్మకంగా పకడ్బందీగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు.

ఢిల్లీలో సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న కృష్ణ ట్రిబ్యునల్‌ వాధనలు, అలాగే 12వ తేదీన మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు సంబంధించి సిడబ్యుసి వద్ద అధికారుల సమావేశం, వంశధార ట్రిబ్యునల్‌ తదితర అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర భారీ మధ్యతరహా నీటి పారుదల శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య నీటి పారుదల, అంతర్రాష్ట్ర జల మండలి శాఖ ఉన్నతాధికారులతో ఆయన టెలిఫోన్‌లో సుదీర్ఘంగా చర్చించారు.

ప్రధానంగా కృష్ణ ట్రిబ్యునల్‌ వాధనలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో కర్ణాటక ఆల్‌మటి ప్రాజెక్టు ఎత్తు పెంపు విషయాలు, మిగుల జలాల పంపిణీ తదితర అంశాలలో పట్టుపడుతున్న సందర్భంగా మన రాష్ట్ర న్యాయనిపుణులు, అంతర్రాష్ట్ర జల వివాదాల మండలి అధికారులు పకడ్బంధీగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రానికి ఒక్క చుక్క నీరు కూడా నష్టపోకుండా రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా, ప్రయోజనాల పరిరక్షణలో ఎలాంటి రాజీ లేకుండా తగిన విధంగా కృషి చేయాలని ఆదేశించారు.

అల్‌మట్టి ఎత్తు పెంపు వల్ల రాష్ట్రానికి కృష్ణా జలాలు తీవ్రంగా నష్టపోతామని, వర్షాలు తక్కువగా ఉన్న సమయంలో మన రాష్ట్రంలో పంటకాలం చాలా ఆలస్యమవుతుందని దీని వల్ల రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున నష్టపోతారని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆల్‌మట్టి ఎత్తు పెంపు విషయంలో వారికి కేటాయించిన నీరు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఖచ్చితంగా పాటించేలా సకల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నది దిగువ రాష్ట్రమైన మన రాష్ట్రానికి గత బచావత్‌ అవార్డులో కేటాయించిన విధంగానే మిగులు జలాల విషయంలో మనకు న్యాయం జరిగే విధంగా చూడాలని ముఖ్యమంత్రి వివరించారు.

అలాగే ఈ నెల 12వ తేదీన ఢిల్లీలో జరగనున్న ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర నీటిపారుదల ఉన్నతాధికారుల సమావేశం గురించి ముఖ్యమంత్రి చర్చించారు. మహారాష్ట్ర రెండు రాష్ట్రాల ఒప్పందాలను, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను, సుప్రీం కోర్టు తీర్పులను ధిక్కరించి ప్రాజెక్టులను, అక్రమంగా నిర్మిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర 13 అక్రమ బ్యారేజీలను నిర్మిస్తుందని ముఖ్యమంత్రి ఆరోపించారు. 13 బ్యారేజీలు నిర్మించి మహారాష్ట్రకు కేటాయించిన 60 టి.ఎం.సి.ల నీటి కంటే ఎక్కువ నీటిని తరలించుకునేందుకు ఎత్తులు వేస్తుందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

ఈ విషయంలో గతంలో అనేక సార్లు అటు ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను, కేంద్ర జల వనరుల శాఖ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సాల్‌ను, కేంద్ర జల వనరుల మండలి అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందని వివరించారు. వారి ఆదేశాల మేరకు 12వ తేదీన రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహారాష్ట్రను సిడబ్ల్యుసి పూర్తి సమాచారంతో రావాల్సిందిగా ఆదేశించడంతో కేంద్రం వద్ద మన ప్రయత్నాలు ఫలించినట్లుగా భావిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలను కేంద్ర జల మండలి అధికారుల ముందు ఉంచాలనే అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు.

ఆంధ్రప్రదేశ్‌ సరైన ఆధారాలను చూపిస్తే కేంద్రం, మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులను నిలిపివేసేందుకు ఆదేశాలు ఇచ్చే అవకాశముందని ఈ విషయంలో అధికారులు చురుగ్గా పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే మన న్యాయవాదులు, అంతరాష్ట్ర జల వివాదాల మండలి, సాగునీటి శాఖ అధికారులు క్రియాశీలకంగా, చురుగ్గా పనిచేస్తున్నారని అన్నారు. అత్యంత కీలకమైన అంతరాష్ట్ర జల వివాదాల విషయంలో అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకొని ఇంకా చాకచక్యంగా పనిచేయాలని లేనిపక్షంలో రాష్ట్రం పెద్దగా నష్టపోయే ప్రమాదముంటుందని ముఖ్యమంత్రి అన్నారు.

వంశధార ట్రిబ్యునల్‌ ఏర్పాటు: వంశధార నదిలో జలాల పంపకానికి సంబంధించి మనకు న్యాయమైన వాట సాధించే విధంగా సమర్ధవంతంగా వాధించేందుకు జల వనరుల అంశాలలో సుదీర్ఘ అనుభవం వున్న న్యాయవాదుల బృందంతో ట్రిబ్యునల్‌ ఏర్పాటుకు సంబంధించి చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. వంశధార ట్రిబ్యునల్‌లో మన రాష్ట్రానికి సంబంధించి హక్కులను కాపాడడంలో న్యాయవాదులు సమర్ధవంతంగా, పకడ్బందీగా, పక్కా వ్యూహంతో తమ వాదనలను వినిపించాల్సి వుంటుంది. ఈ వాదనల ఆధారంగా ఒక నివేదిక రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: