ఆకట్టుకునే కథాంశంతో పనేముంది?


చాలా రోజుల విరామం తర్వాత అన్నట్లు నందమూరి బాలకృష్ణ చిత్రం విడుదలయింది. ఆయన గత చిత్రాలకు భిన్నమైన కథాంశంతో కాకపోయినా, తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నంగా చేసిన ‘సింహా’పై ఆయన అభిమానులే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమ కూడా భారీ ఆశలే పెట్టుకుంది. సమరసింహారెడ్డి అంతటి భారీ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని బోయపాటి ఈ చిత్రాన్ని రూపించినట్లు సినిమా ఆశాంతం చూసిన వారికి అర్ధమవుతుంది. ద్విపాత్రాభినయంలో బాలయ్య తన విశ్వరూపాన్ని ‘సింహా’ ద్వారా మరోమారు చూపించారు.

ఆదర్శ భావాలున్న శ్రీమన్నారాయణ ఓ కాలేజీలో ప్రొఫెసర్. జానకి అనే అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఆమెకు దగ్గరవుతాడు. ఓ ముఠా ఆమెను ఎత్తుకుపోవాలని చూస్తుంటే, ఆమె తండ్రి కూడా అదే సమయంలో అక్కడికి వస్తాడు. ఆ ఘర్షణలో శ్రీమన్నారాయణ బామ్మ గాయపడుతుంది. ఆ సందర్భంలో- తన తండ్రి నరసింహ గురించి శ్రీమన్నారాయణ తెలుసుకుంటాడు. జమిందారీ కుటుంబంలో పుట్టి, వైద్య వృత్తి చేస్తున్న నరసింహ ప్రజాకంటకులుగా మారిన వీరకేశవులు ముఠాను మట్టుపెడుతుంటాడు. వీరకేశవులు పన్నిన కుట్రలో నరసింహ భార్యా సమేతంగా మరణిస్తాడు. ఈ విషయాన్ని బామ్మ నుండి తెలుసుకున్న శ్రీమన్నారాయణ, తండ్రి తలపెట్టిన పని ఎలా పూర్తి చేశాడనేదే ఈ చిత్ర కథాంశం.

బాలకృష్ణ అభిమానులను, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా వుంటుందీ చిత్రం. గతంలో బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ చిత్రాలను మళ్ళీ చూసినట్లుంటుంది. ఏమాత్రం కొత్తదనం కనబడదు. నేపథ్యం రాయలసీమ అనే బదులు బొబ్బిలి అని మార్చారు. యాక్షన్ అంటే ఇష్టపడే బోయపాటి శ్రీను బాలయ్య కాంబినేషన్లో చేసిన ఈ చిత్రంలో మరింత రెచ్చిపోయాడు. సగానికిపైగా సినిమా ఈ హింసతోనే నిండిపోయింది. ఇటువంటి సన్నివేశాలను ప్రేక్షకులపైకి ఎలా వదిలేసారో సెన్సార్ వారికే తెలియాలి.

నరసింహ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్. హీరో విలన్ల కారు ఛేజ్, నరసింహ పరిచయం, విలన్ తో హీరో హాస్పిటల్ సీన్, పోలీస్ స్టేషన్లో కమిషనర్ తో సన్నివేశం బాగున్నాయి. హీరో హీరోయిన్ల వ్రతం రొమాంటిక్ సీన్, నరసింహను తల్లి సమర్థించే సన్నివేశం, పోలీసు అధికారితో నయనతార వాగ్వాదం బాగున్నాయి. నరసింహ చనిపోయే పోరాట సన్నివేశం చాలా బాగుంది.

దీనికి ‘మగధీర’ పోలికలున్నాయి. ఫ్లాష్ బ్యాక్‌లో హీరోహీరోయిన్ల గెటప్‌లు బాగున్నాయి. అలాగే సంభాషణలు కూడా బాగున్నాయి. ”చరిత్ర సృష్టించాలన్నా… చరిత్ర తిరగరాయాలన్నా మాకే చెల్లింది” అంటూ నందమూరి అభిమానులను అలరించే డైలాగులు కూడా వున్నాయి.

నరసింహగా, శ్రీమన్నారాయణగా రెండు పాత్రల్లోనూ బాలకృష్ణ చేసారు.

ప్రధానంగా, నరసింహ పాత్ర మూమెంట్స్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. జమిందారు, వైద్యుడు, అన్యాయాన్ని అంతమొందించే వ్యక్తిగా మూడు రకాల షేడ్స్‌ను చక్కగా చూపించాడు. అయితే ఫైట్స్‌లో రాణించినంతగా డాన్స్‌లు చేయలేకపోయాడు. పైగా శ్రీమన్నారాయణ గెటప్‌లో గ్లామర్ కొరవడింది. ప్రొఫెసర్ అయ్యుండి చొక్కా గుండీలు విప్పుకుని తిరగడం, అమ్మాయిల భుజాలు చరవడం బాగులేదు.

చిన్న పాత్ర అయినా, నరసింహ భార్యగా నయనతార బాగా చేసింది. నమిత తన పాత్రకు మరీ ఎక్కువ అయిపోతే, స్నేహా ఉల్లాల్ మరీ తక్కువ అయిపోయింది. నమితను చూడటానికి రెండు కళ్ళూ చాలకపోగా, స్నేహా ఉల్లాల్ మొహంలో కనీస హావభావాలు కూడా పలకలేదు. బ్రహ్మానందం, వేణుమాధవ్, కృష్ణభగవాన్, ధర్మవరపు, అలీల కామెడీ పండలేదు. వున్నంతలో ఝాన్సీ బెటర్. ఇతర పాత్రలు కె.ఆర్.విజయ, రెహమాన్, కిన్నెర, కోట, చలపతిరావు, డా. రవిప్రకాష్, సాయికుమార్, ఆనందభారతి పోషించారు.

చక్రి పాటలు రెగ్యులర్ కమర్షియల్ పద్ధతిలోనే సాగాయి. చిత్రీకరణ కూడా అంతే. చిన్న బ్యాక్ గ్రౌండ్ సంగీతం, విల్సన్ ఫొటోగ్రఫీ, కోటగిరి ఎడిటింగ్ బాగున్నాయి. యునైటెడ్ మూవీస్ సమర్పణలో బోయపాటి శ్రీను కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో పరుచూరి కిరీటి ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి బాలయ్య తాజా చిత్రం ఆయన అభిమానులనే కాకుండా సినీ ప్రియులను ఆకట్టుకునేలానే ఉంది. విమర్శకులు సైతం బాలయ్య ‘సింహ’రూపాన్ని చూసి మెచ్చుకుంటున్నారు.

ఇ.శివలక్ష్మి.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: