ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాల విడుదల


హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది 65 శాతం ఉత్తీర్ణత ఉన్నట్లు ఇంటర్‌ బోర్డు తెలిపింది. పరీక్షలు రాసినవారు 9,17,794 మంది కాగా 4,50,248 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్‌ బోర్డు ఎదుట ఎస్‌.ఎఫ్‌.ఐ ఆందోళన
ఇంటర్‌ బోర్డులో సెకండియర్‌ ఫలితాల హడావుడి ఓ వైపు కొనసాగుతుంటే మరోవైపు బయట ఎస్‌.ఎఫ్‌.ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫీజును బోర్డు ఈ ఏడాది ప్రస్తుతం ఉన్న 20 రూపాయలనుంచి 100 రూపాయలకు పెంచింది. దీన్ని ఎప్పటిలా తగ్గించాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగి మంత్రి మాణిక్య వర ప్రసాద్‌ను లోనకు రానివ్వలేదు.పోలీసులు రంగప్రవేశం చేసి విద్యార్థులను అరెస్టు చేయటంతో ఆయన లోనకు వచ్చి ఫలితాలను విడుదల చేశారు.

కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత


శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని కుప్వారా ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు ద్వారా దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చిచంపాయి. తెల్లవారుఝామున గస్తీ నిర్వహిస్తున్న భద్రతాదళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్‌ ప్రారంభమయింది. ఈ సంఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు.

వ్యవసాయశాఖపై సీఎం సమీక్ష


హైదరాబాద్‌: ఈ ఏడాది రైతులకు 38వేల కోట్ల రూపాయల పంటరుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చే పంట రుణాలపై 12లేదా 13 తేదీల్లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. సచివాలయంలో ఈరోజు వ్యవసాయశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 2006లో రాష్ట్రప్రభుత్వం పంపిన ముసాయిదాకు అనుగుణంగా 2004 విత్తనచట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టటంపై హర్షం వ్యక్తం చేశారు. విత్తనాల్లో నాణ్యత లోపిస్తే పరిహారంపైన, విత్తనాల ధర నిర్ణయించే అంశంపైనా నిర్ణయాధికారం రాష్ట్రప్రభుత్వానికే ఇవ్వాలని కోరుతూ ప్రధానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. దీనిపై ఎంపీలు, రైతుసంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలవాలని మంత్రి రఘువీరాను ఆదేశించారు.

వేటగాళ్ల బారినపడి 7 నెమళ్ల మృతి


కరీంనగర్‌: జిల్లాలోని బెజ్జంకి మండలం కళ్లేపల్లి సమీపంలో వేటగాళ్ల బారినపడి ఏడు నెమళ్లు మృతి చెందాయి. గ్రామ సమీపంలోని నర్సింహులు చెరువువద్ద ఇవి పడి ఉండటంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సిద్ధిపేట ప్రాంతానికి చెందిన వేటగాళ్లు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నెమళ్లను వేటాడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ఎయిమ్స్‌ తరహాలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దాలి: కిషన్‌రెడ్డి


విశాఖపట్నం: ఎయిమ్స్‌, నిమ్స్‌ తరహాలో ప్రభుత్వాసుపత్రులను తీర్చిదిద్దాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కోరారు. ఉత్తరాంధ్రులకు ఆరోగ్యప్రదాయినిగా ఉన్న కింగ్‌జార్జి ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేయాలన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆయన కింగ్‌జార్జి ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌ పాకిస్థానీ ఉగ్రవాదుల అడ్డాగా మారిందన్నారు.

శ్రీశ్రీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభం


విశాఖపట్నం: మహాకవి శ్రీశ్రీ శత జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలమైన విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సాగరతీరంలోని శ్రీశ్రీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు తైనాల విజయకుమార్‌, ద్రోణంరాజు శ్రీనివాస్‌, ఆంధ్ర విశ్వకళాపరిషత్‌ ఉప కులపతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీశ్రీ విశాఖలో పుట్టటం విశాఖవాసుల అదృష్టమన్నారు. హైదరాబాద్‌లో విరసం ఆధ్వర్యంలో ప్రారంభమైన శతజయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. పీఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి శ్రీశ్రీ పుస్తకాల సంకలనంలో ఒక దాన్ని ఆవిష్కరించారు.

రోడ్డు ప్రమాదంలో 7గురి మృతి


విజయనగరం: విజయనగరం జిల్లాలో ఈరోజు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. భోగాపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆటో,లారీ ఢీకొనటంతో ఏడుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.