వారపుసంతలకు తరలిస్తున్న కలప!


విశాఖపట్నం: మన్యంలో ఎటు చూసినా పచ్చదనం కనులపండువ చేస్తుంది. కొండకోనల్లో పెరిగిన వృక్షాలు పచ్చ ‘ధనానికి’ రక్షణగా కొలువు తీరుతాయి. అయితే స్మగ్లర్ల స్వార్థ్యం గొడ్డలివేటుకు ఈ చెట్లు నేలకూలుతున్నాయి. మరోవైపున రోజు గడవడానికి గిరిజనులు చెట్లను నరుకుతున్నారు. కలపను సంతల్లో సైతం అమ్ముతున్నారు. వారపు సంతల్లో బహిరంగంగా కలపను అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారంపై అటవీ శాఖ అధికారులు దృష్టి పెట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. బూదరాళ్ల పంచాయతీకి చెందిన సుమారు 30 గ్రామాల గిరిజనులు గతంలో వారపుసంతలకు అడ్డాకులు, కోవెల జిగురు వంటి అటవీ ఫలసాయాన్ని తెచ్చి విక్రయించేవారు. అటవీశాఖ అధికారులకు భయపడి కలపను చాటుమాటున విక్రయించేవారు. అయితే అటవీశాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో అవకాశం చూసుకుని కలపను బహిరంగంగా విక్రయిస్తున్నారు. వేలల్లో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న కలప విక్రయం వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు. మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు ఈ కలపను పెద్ద ఎత్తున కొని తోటల్లో భద్రపరిచి రాత్రి రవాణా చేస్తున్నారు. అయితే ఇంత బహిరంగంగా కలప వ్యాపారం జరుగుతున్నా అటవీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయమని స్థానికులు విమర్శిస్తున్నారు. గిరిజనులకు అవగాహన లేక విలువైన చెట్లను నరికేస్తున్నారని, అధికారులు దీన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు.

Leave a comment