‘రావణ్’ షూటింగ్ లో ప్రమాదం


తిరువనంతపురం: ప్రముఖ దర్శకుడు మణిరత్నం పలు అవరోధాల మధ్య ‘రావణ్’ షూటింగ్ ను మళ్లీ సెట్స్ పైకి తీసుకువచ్చినప్పటికీ దురదృష్టం మాత్రం ఇంకా వెన్నాడుతూనే ఉంది. బుధవారం సాయంత్రం కేరళలోని చాలక్కుడి సమీపంలో ఉన్న అతిరప్పలి జలపాతాల వద్ద షూటింగ్ ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. షూటింగ్ కోసం తీసుకువచ్చిన కుంజు అనే ఏనుగు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. ఏనుగును లొంగదీసుకునేందుకు ప్రయత్నించిన ట్రయినర్, మావటి ఆండవన్ ను తొక్కి చంపింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు సమీపంలోనే ఉన్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, విక్రమ్ లు తృటిలో తప్పించుకున్నారు.

ఇండియాలో అత్యధిక సంఖ్యలో ఏనుగులు కేరళలోని తిరుచూరి జిల్లా అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, టూరిస్ట్ ప్రోగ్రామ్ లు వంటి పలు కార్యక్రమాలకు వీటిని ఉపయోగిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లోనే ఏనుగులు అదుపుతప్పి బీభత్సం సృష్టించిన సంఘటనలు కూడా ఉన్నాయి. కుంజు అదుపుతప్పి మావటిని చంపడంతో అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకున్న అభిషేక్, ఐశ్వర్య, విక్రమ్, తదితరులను కేరళ అటవీ శాఖ అధికారులు అదే అడవుల్లోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఏనుగు యజమాని, మరో ట్రైనర్ కలిసి దానిని అదుపులోనికి తీసుకునేంతవరకూ అభిషేక్, ఐశ్వర్య తదితరులు కొద్ది గంటల సేపు టెన్షన్ కు గురయ్యారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో తదుపరి షూటింగ్ ను మణిరత్నం నిలిపివేశారు.

అడుగడుగునా గండాలే…
మణిరత్నం హిందీ, తమిళ భాషల్లో ‘రావణ్’ చిత్రం ప్రారంభించినప్పటి నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. తొలుత టైటిల్ విషయంలో సమస్య తలెత్తింది. ‘రావణ్’ టైటిల్ ను తమిళ డైరెక్టర్ ఒకరు ఛాంబర్ లో రిజిస్టర్ చేసుకోవడంతో ‘అశోగ వనం’ అనే టైటిల్ ను మణిరత్నం రిజిస్టర్ చేయించాల్సి వచ్చింది. హిందీలో మాత్రం ‘రావణ్’ పేరునే ఉంచారు. 50 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న తరుణంలో మణిరత్నం హృద్రోగ సమస్యలతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో మూడు నెలలకు పైగా షూటింగ్ నిలిచిపోయింది. దీంతో అప్పటికే వేరే సినిమాలకు డేట్స్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్ మణికండన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ స్థానంలో సంతోష్ శివన్ ను తీసుకున్నారు. మణిరత్నం ఇటీవల పూర్తి స్వస్థత చేకూరడంతో కేరళలోని పలు ప్రాంతాల్లో నిరవధికంగా షూటింగ్ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఏనుగు సృష్టించిన బీభత్సం మరోసారి షూటింగ్ కు అంతరాయ కలిగించింది. ఈ చిత్రాన్ని మణిరత్నం సొంత బ్యానర్ మద్రాస్ టాకీస్ పతాకంపై ఆయన సోదరి శారద నిర్మిస్తున్నారు.

Leave a comment