రిజర్వేషన్‌ అనేది చట్టబద్ధమైన హక్కు!


ప్రతిరోజూ వేలాదిమంది స్త్రీలు కిటకిటలాడే బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. నగరాల్లో తిరిగే స్త్రీలకి ఇది నిత్యపోరాటం. ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు ఈ రద్దీ బస్సుల్లో ప్రయాణం చేస్తూ,ఇంటా, బయటా వుండే పని ఒత్తిడికి ఈ బస్సు ఒత్తిడి తోడై చాలా సతమతమవుతుంటారు.  చాలా సంవత్సరాల క్రితమే ప్రభుత్వం స్త్రీలకు ఆర్‌.టి.సి బస్సుల్లో రిజర్వేషన్‌ కల్పించింది. ప్రతి బస్సులోనూ తొమ్మిది సీట్లు మహిళల కోసం రిజర్వ్‌ చేయబడ్డాయి. అయితే స్త్రీల కోసం రిజర్వ్‌ చేసిన సీట్లు కూడా చాలా సార్లు పురుషులే ఆక్రమించుకోవడంవల్ల బస్సుల్లో మహిళల కష్టాలు మరింత పెరుగుతున్నాయి.  జిల్లాల్లో తిరిగే బస్సుల్లో ఈ రిజర్వేషన్‌లు సక్రమంగా అమలు కావడమే లేదు.  బస్సుల్లో తొమ్మిది సీట్లు మహిళల కోసం రిజర్వ్‌ చేయబడ్డాయి. అంటే మిగతా సీట్ల మీద స్త్రీలకు హక్కు లేదని అర్ధం కాదు. బస్సులో ఏ సీటులోనైనా స్త్రీలు కూర్చోవచ్చు. అయితే రిజర్వ్‌ చేసిన సీట్లలోకూడా పురుషులే కూర్చుని ప్రయణం చేస్తూ, స్త్రీలు రాగానే ఖాళీ చేయకుండా వంకరటింకర వాదనలు చేస్తున్నారు. డ్రైవర్‌, కండక్టర్‌లు ఈ వంకర వాదనలకి తందాన తాన అనడం అత్యంత విచారకరం. వీరివాదన ఎంత వితండంగా వుంటుందంటే బస్సుడిపో నుండి బయలుదేరినపుడు స్త్రీల సీట్లు ఖాళీగా వుంటే, వాటిల్లో పురుషులు కూర్చుంటే ఆ సీట్లు పురుషులవేనట. మధ్యలో వచ్చే స్టేజిలో స్త్రీలు ఎక్కినా కానీ పురుషులు లేవక్కర్లేదట. ఈ వంకర వాదనకి అర్ధం ఏమిటంటే స్త్రీలు డిపోనుండి ఎక్కితేనే వాళ్ళకు రిజర్వుడు సీట్లలో కూర్చునే హక్కుంటుందని చెప్పడమన్నమాట. అప్పుడు రిజర్వేషన్‌కి అర్ధమేముంది? రిజర్వేషన్‌కి వీరిస్తున్న నిర్వచనాలు వింతగా ఉంటున్నాయి. బస్సులో స్త్రీలు లేకపోతే పురుషులు కూర్చోవచ్చు. అయితే స్త్రీలు ఎవరైనా మధ్యలో ఎక్కితే పురుషులు ఖచ్చితంగా లేచి ఆ సీటు ఖాళీ చెయ్యలి. అలా చెయ్యకుండా పోట్లాటలకి దిగుతున్నారు. ఇటీవలకాలంలో బస్సులో మొదటి రెండు సీట్లను వికలాంగులకు, సీనియర్‌ సిటిజన్‌లకు కేటాయించారు. సంతోషమే. అవసరం కూడా. అయితే ఈ సీట్లను స్త్రీల రిజర్వేషన్‌లోంచి కోతపెట్టి ఇవ్వడం అన్యాయం.మరో అన్యాయం ఏమిటంటే ఆ రెండు సీట్లలోను పురుష వికలాంగులు, పురుష సీనియర్‌ సిటిజన్‌లు మాత్రమే కూర్చోవాలనడం.. స్త్రీ వికలాంగులు, స్త్రీ సీనియర్‌ సిటిజన్‌లు స్త్రీలకు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలట. ఇదెంత అసంబద్ధమైన వాదనో గమనించండి. స్త్రీలకు కేటాయించిన తొమ్మిది సీట్లను పునరుద్ధరించాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము. అలాగే బస్సుల్లో రిజర్వేషన్‌ గురించి రాసిన స్లోగన్‌లు కూడా అభ్యంతరకరంగా వున్నాయి. ‘’ స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చోనిద్దాం’’, అంటూ రాయడం వెనుక దయదాక్షిణ్యంతో, ఆర్‌.టి.సి వారు, ప్రయాణికులు కూర్చోనిస్తేనే మనం కూర్చోవాలి అని అర్ధం వచ్చేలా వుంది. రిజర్వేషన్‌ అనేది చట్టబద్ధమైన హక్కు. ఎవరి దయదాక్షిణ్యంకాదు. స్త్రీల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కండక్టర్‌కి, డ్రైవర్‌కి ఈ విషయమై ఖచ్చితమైన ఆదేశాలివ్వాలి. కండక్టర్‌ దగ్గర కంప్లయింట్‌ పుస్తకం తప్పనిసరిగా వుండేలా చర్యలు తీసుకోవాలి. స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం బయటకొచ్చి ఎన్నో పనులను చక్కబెట్టుకుని రావడం విపరీతంగా పెరిగిన పరిస్థితుల్లో కూడా పాత రిజర్వేషన్‌లనే పట్టుకు వేళ్ళాడడం అన్యాయం. 50% సీట్లులో కేటాయించాల్సిన అవసరమున్న సందర్భంలో, వున్న వాటిని సక్రమంగా అమలు చేయక పోవడం విచారకరం. 70% సీట్లు కూర్చునే పురుషులు, స్త్రీలకు కేటాయించిన 30% సీట్లను కూడా ఆక్రమించుకోవడం, స్త్రీలకు మిగతా సీట్లలో కూర్చునే హక్కు లేదనుకోవడం అమానవీయం. ఇక రైళ్ళ విషయనికొస్తే ప్రతి రైలులోను ఒక స్త్రీల బోగీ వుంటుంది. ప్రయణాలు చేసే స్త్రీల సంఖ్య బాగా పెరిగినప్పటికీ అర్ధశతాబ్దం కింద వేసిన ఒకేఒక బోగీపద్ధతి ఈనాటికీ కొనసాగుతోంది. అంతే కాకుండా ఈ బోగీ కూడా చిట్టచివర వేళ్ళాడుతూండడంవల్ల స్త్రీలు భద్రత సమస్యతో పాటు అనేక ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్త్రీల బోగీ ఎప్పుడు ఫ్లాట్‌పారమ్‌ మీదికి రాదు. అందువల్ల ఈ బోగీలోకి కాఫీ, టీలు గాని కనీసం మంచినీళ్ళుగానీ కన్నెత్తి చూడవు. స్త్రీల బోగీలు మూడుకు పెంచాల్సిందిగాను, వీటిని రైలు మధ్యలో అమర్చాల్సిందిగాను డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే రిజర్వేషన్‌ కాంప్లెక్సుల్లో చాలా చోట్ల స్త్రీలకు ప్రత్యేకమైన కౌంటర్లుండవు. ఒకవేళ వున్నా వికలాంగులు, సీనియర్‌ సిటిజన్‌లు మాజీ సైనికోద్యోగులతో స్త్రీలను కలిపేస్తారు. స్త్రీలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయల్సిందిగా కోరుతున్నాం. తన సిబ్బంది స్త్రీల పట్ల గౌరవంగా, జండర్‌ అవగాహనతో మెలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్త్రీల హక్కుల పట్ల చైతన్యంతో, సంస్కారంతో వుండేలా జండర్‌ అవగాహనా శిక్షణ నివ్వాలి. లేకపోతే స్త్రీలపట్ల ఒక మొరటు వైఖరి యంత్రిక దృక్ఫథం పెరిగే ప్రమాదం వుంది.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: