చెర్నోబిల్: చెర్నోబిల్‌లో అణుప్రమాదం జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రజలు ఆనాటి ప్రమాదంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటించారు. 1986 ఏప్రిల్ 26 ఉదయం యుక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో పేలుడు సంభవించింది. పదిరోజుల పాటు మండిన ఆ అణుమంటలవల్ల వెలువడిన రేడియోధార్మికత హీరోషిమా, నాగసాకిల మీద వేసిన అణుబాంబుల కన్నా 100 రెట్లు ఎక్కువ. ప్రమాదంలో వెలువడిన రేడియేషన్ యూరోప్ దేశాల వరకూ వ్యాపించింది. లెక్కకు ఆనాడు చనిపోయిన వారి సంఖ్య తక్కువే అయినా రేడియోధార్మికత ప్రభావంతో లక్షలాది మంది ప్రజలు క్యాన్సర్లు, పలు ఇతర వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి సహాయచర్యల్లో పాల్గొన్న 25,000 మంది ఆ తర్వాత కొంతకాలానికే అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పుడు పిల్లలుగా ఉన్నవాళ్లు పెద్దవాళ్లయ్యాక 6 వేలకు పైగా మంది థైరాయిడ్ క్యాన్సర్ బాధితులయ్యారు. చెర్నోబిల్ దుర్ఘటన జరిగి పాతికేళ్లయిన నేపథ్యంలో, తాజాగా జపాన్ సంఘటననూ గుర్తుచేస్తూ… అణువిద్యుత్ కేంద్రాలు మూసివేయాలంటూ ఫ్రాన్స్, జర్మనీలలో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. గతవారం చెర్నోబిల్ సందర్శించిన ఐరాస సెక్రెటరీ జనరల్ బాన్ కి మూన్ ఈరోజు ఒక సందేశం వెలువరించనున్నారు.
Filed under: వార్తలు




