సుదర్శన్‌రెడ్డి ఇంటిని ముట్టడించిన బీసీ నాయకులు

హైదరాబాద్‌: విద్యానగర్‌లోని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి ఇంటిని బీసీ నాయకులు ముట్టడించారు. బోధనాఫీజుల చెల్లింపుపై హైకోర్టులో సరిగా వాదనలు వినిపించలేదంటూ సుదర్శన్‌ ఇంటి వద్ద వారు ఆందోళనకు దిగారు. సుదర్శన్‌ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్థి నాయకులు యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ: డీజీపీ

హైదరాబాద్‌: ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌పై అనుమానాల నివృత్తికి సమగ్ర విచారణ చేపడతామని డీజీపీ గిరీష్‌కుమార్‌ తెలిపారు. ఓయూలో లెక్చరర్లపై దాడి దురదృష్టకరమని అన్నారు. దోషులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

రాజగోపురం పునర్‌నిర్మాణానికి శంకుస్థాపన

శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రాజగోపురం పునర్‌నిర్మాణానికి ముఖ్యమంత్రి రోశయ్య శకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన వాయులింగేశ్వరుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉస్మానియా వర్శిటీలో విద్యార్థులు వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని అన్నారు. ఇలాంటి చర్యల వల్ల నిజంగా తెలంగాణ కావాలనుకునే ఆశ మరింత దూరం అవుతుందని ఆయన అన్నారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన ఆయన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో గృహనిర్మాణ సముదాయాన్ని ప్రారంభించారు.

కోస్తా, తెలంగాణలో వర్షాలు

విశాఖపట్నం: రుతుపవానాల వల్ల కోస్తా, తెలంగాణలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాతీరం వెంబడి 45 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. జాలర్లు అప్రమత్తంగా ఉండాలని అదికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కూలిన హెలికాఫ్టర్‌… 10 మంది మృతి

కరాకస్‌: వెనుజులాలో ఆ దేశ భద్రతా దళానికి చెందిన ఓ హెలికాఫ్టర్‌ కూలిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందినట్లు ఆ దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రష్యా తయారు చేసిన ఈ మిగ్‌ – 17 బయలుదేరిన కాసేపటికే కూలిపోవడంపై అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదం కొలంబియా సరిహద్దు వెంబడి ఉన్న బ్యునా విస్టా పట్టణ సమీపంలో జరిగింది.

రామ్‌గోపాల్‌వర్మకు బెదిరింపు కాల్స్‌

హైదరాబాద్‌: దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. చంపేస్తామంటూ ఓబుల్‌రెడ్డి అనుచరులు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు సమాచారం. ‘రక్తచరిత్ర’లో ఓబుల్‌రెడ్డి పాత్రను ఎందుకు చిత్రీకరించారంటూ అనుచరులు బెదిరించినట్లు తెలుస్తోంది. ముంబయిలోని వర్మ కార్యాలయానికీ బెదిరింపు లేఖలు పంపారు. దీనిపై ముంబయి పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ రామ్‌గోపాల్‌ వర్మ స్పందించారు.

ఢిల్లీ పోలీసుల కస్టడీలో చర్లపల్లి జైలులోని తీవ్రవాది

హైదరాబాద్‌: చర్లపల్లి జైలులో ఉన్న తీవ్రవాదిని ఢిల్లీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం తీవ్రవాది జియాఉల్‌హక్‌ను వారంపాటు కస్టడీలోకి తీసుకున్నట్లు సమాచారం.

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడుతోంది. దీంతో కొత్తగూడెం, మణుగూరులో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షానికి అశ్వారావుపేట మండలంలో వందల ఎకరాల్లో వరిపంట నీటమునిగింది. భారీవర్షానికి సత్తుపల్లి జలదిగ్బంధంలో ఉంది. సత్తుపల్లి-కాకర్లపల్లి రహదారిలో గడిదలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాష్ట్రీయ రహదారికి భారీగా గండి పడింది.

గోదావరి జిల్లాల్లో వరదముప్పు

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో కొండకాలువలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తపట్టిసీమ వద్ద కొవ్వాడ కాల్వకు గండి పడింది. 300 ఎకరాల పంట నీటమునిగింది. రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా సూరంపాలెం రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు చేరుతోంది. దీంతో అధికారులు 4 గేట్లను ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలకు వరదముప్పు ఏర్పడింది.

తుమ్మలకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సత్తుపల్లి-కాకర్లపల్లి మధ్య గడిదలవాగు వరదలో తుమ్మల చిక్కుకున్నారు. దీన్ని గమనించిన స్థానికులు ఆయనను క్షేమంగా బయటకుతీసుకువచ్చారు.

Follow

Get every new post delivered to your Inbox.