కర్నూలు: ప్రజలను వేదించే ఎన్నో రకాల సమస్యలకి పరిష్కారాలు చూపడమే ప్రజావాణి ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ రాంశంకర్ నాయక్ పేర్కొన్నారు. కలెక్టరు కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ప్రజలు ఎవ్వరుకూడ సమస్యలు, బాధలు, ఇబ్బందులకు గురికాకుండా ప్రజాసమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై వుందని కలెక్టరు అన్నారు. మారుమూల గ్రామాల నుంచి ప్రజలు వచ్చి పలురకాల సమస్యలు విన్నవించారు. వెంటనే స్పందించి కలెక్టరు సంబందిత అధికారులకు పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసారు. భూమి తగాదాలు, రద్దుచేసిన రేషన్ కార్డుల పునరుద్దరించాలని, వరద నిధి కింద ఇళ్లు నిర్మించుకోవడానికి మంజూరు చేయాలని, పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని ప్రజలు కలెక్టర్‌ను కోరారు. కల్లూరు మండలం గణష్ నగర్ 21వ వార్డ ులో కె.సి కెనాలు వెంట 80 కుటుంబాలు గుడిసెలు వేసుకొని దాదాపు 15 సంవత్సరాల నుంచి జీవనం చేస్తున్నాం అధికారులు చూస్తూ పోతూనే వున్నారు. నివసించే స్థలానికి పట్టాలు ఇవ్వాలని మేరమ్మ, ఇతరులు పెద్ద ఎత్తున ప్రజావాణికి వచ్చి కలెక్టరుకు విజ్ఞప్తి చేసారు. పరిశీలించి స్థలం వుంటే అర్హులైన వారికి మంజూరు చేయాలని కలెక్టర్ కల్లూరు తహశీల్దారులకు ఆదేశాలు జారీ చేసారు. బాడుగ ఇంట్లో వున్నాం, ఎక్కడ సెంటు స్థలం లేదు, ఇంటి స్థలంతో పాటు ఇళ్లు మంజూరు చేయాలని కర్నూలు నగర్, బాపూజీ నగర్‌కు చెందిన యాదమ్మ భర్త లింగన్న కలెక్టరును కోరారు. బి.ఎస్.సి వరకు చదువుకున్నాను, 2007 పడవ ప్రమాధంలో మాకు జీవనాధారమైన మా అన్న మరణించారు. ఆ రోజు నుంచి మా అమ్మ కూలి నాలి చేసి చదివించింది. దిక్కుతెలియని పరిస్థితుల్లో వున్నాం జీవనాధారం కోసం కంప్యూటర్ ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని జయమ్మ తల్లి వెంకటమ్మ కలెక్టరును పదే పదే వేడు కున్నారు. పూర్వం మాతాతల తరం నుంచి వున్న నడిత్రోవ రస్తా ఈ నెల 28న ప్రొక్లైన్ ద్వారా రస్తాను తొలగించి మల్లారెడ్డి, వెంకటరెడ్డిలు రస్తను పొలంలో కలుపుకొన్నారు. గ్రామంలో మిగతా రైతులందరూ ఆ రస్తా గుండా పొలాలకు వెళ్లాలి ఇదిఏమని అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. సరిగ్గా సర్వే చేయించి రస్తా సమస్యను పరిష్కరించాలని కొత్తపల్లె మండలం జి. వీరాపురం గ్రామ నివాసి వెంకటలింగారెడ్డి, తండ్రి సుబ్బారెడ్డి, ఇతరులు కలెక్టర్‌కు మొరపెట్టు కున్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ అధికారులను పంపి సర్వేచేస్తాం, ఘర్షణ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల అధికారులను ఆదేశించారు. దొర్నిపాడు మండలం పాముపల్లె గ్రామ పొలిమేరలో నా పొలం వుంది. ఎన్ని సార్లు తిరిగిన తహశీల్దారు పట్టా ఇవ్వలేదు. కడప పార్లమెంట్ సభ్యులు సిఫారసు చేసినా ఇవ్వడం లేదు. సర్వే నంబరు 442 సరిగ్గా సర్వేచేసి పట్టాదారు పాసు పుస్తకం ఇప్పించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసారు. ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సంపత్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




