జులై 10, 2009...05:05

గొత్తికోయలను ఆదుకుంటాం

Jump to Comments

ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టం నుండి ఖమ్మం జిల్లాకు వలస వచ్చిన గొత్తికోయలను అన్ని విధాలుగా ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ వి.ఉషారాణి పేర్కొన్నారు. నేషనల్‌ కమి షన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌రైట్స్‌ సభ్యులు, జిల్లా అధికారులు స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ఛత్తీస్‌గఢ్‌ నుండి వలస వచ్చిన గొత్తికోయల పిల్లలను, మహిళలను ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా పెద్ద సంఖ్యలో గొత్తికోయలు మన జిల్లాకు వలస వస్తున్నారని, వారిక తాత్కాలికంగా వసతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గొత్తికోయల సంక్షేమం కోసం జిల్లాలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి వారికి కనీస అవసరాలు కల్పించే విధంగా సహకరించాలని కో రారు.

2005 సంవత్సరానికి ముందు జిల్లాకు వచ్చి స్థిరపడిన గొత్తికోయల కోసం 189 అంగన్‌వాడీ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 1,547 మందికి రేషన్‌ కార్డులు కూడా ఇచ్చామని వివరించారు. కొత్తగా వలసవస్తున్న వారికి గతంలో వలస వచ్చిన వారి దగ్గరగా ఆవాసాలు ఏర్పాటు చేయడంలో స్వచ్ఛంధ సంస్థలు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. అదే విధంగా గొత్తికోయలు అడవిని నరకకుండా పోడు వ్యవసాయం చేయకుండా ఉండే విధంగా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ హక్కుల పరిరక్షణ కమిషన్‌ దిపాదిక్షత మాట్లాడుతూ జిల్లా స్థాయిలో స్వచ్ఛంద సంస్థలు జిల్లా యంత్రాంగంతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న గొత్తికోయల వివరాలకు సంబందించిన సమగ్ర సర్వే చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వి.రామాదేవి, ఉపసంచాలకులు, సోషల్‌ వెల్ఫేర్‌ ఇతర అధికారులు వివిద స్వచ్చంధ సంస్థల సభ్యులు సిరి కాంతారావు, సేవా కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యుత్తరమిమ్ము