పాలమూరు ప్రాజెక్టులు ఏం పాపం చేశాయి?


మహబూబ్‌నగర్‌‌: నిధుల కేటాయింపులో ముఖ్యమంత్రి వైఎస్‌ చూపిస్తున్న సవతితల్లి ప్రేమతో పాలమూరు ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉన్నాయని ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు. పులివెందుల ప్రాజెక్టులకున్న నిధులు పాలమూరుకెందుకు లేవని ఆయన ప్రశ్నించారు. జిల్లాలోని నాలుగు ప్రాజెక్టులకు రూ.232 కోట్ల బకాయిలు చెల్లించాలని, ఈ కారణంగానే గత ఆరునెలలుగా పనులు నిలిచిపోయాయన్నారు. వాటిని త్వరగా ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. నిర్దేశించిన సమయం ఎపుడో ముగిసిందని, మళ్లీమళ్లీ తేదీలు పొడిగించినా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదని విమర్శించారు. కల్వకుర్తి మహాత్మాగాంధీ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మొదటి లిఫ్ట్‌ ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ 67.89శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. కేటాయించిన బడ్జెట్‌ రూ.495 కోట్లయితే ఇప్పటిదాకా రూ.336 కోట్ల వెచ్చించారని, చెల్లించాల్సిన బిల్లులు ఇంకా రూ.42 కోట్లున్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమస్యలు లేకున్నప్పటికీ ఎందుకు నిర్మాణం పూర్తికావడం లేదని ప్రశ్నించారు. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి డిండిప్రాజెక్టు నుంచి ఇసుక తీసుకుంటామని ఒప్పందంలో ఉన్నప్పటికీ చుట్టుపక్కల వాగులనుంచి ఇసుక తీస్తూ కోట్లరూపాయలు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు.

లిఫ్ట్‌-2లో రూ.21.44, లిఫ్ట్‌-3లో రూ.13.5, ప్యాకేజీ 28కి 4.16 కోట్లు బకాయిలున్నాయన్నారు. ఈ నెల 30తో పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ 80శాతం పనులు పూర్తికాలేదన్నారు. ప్యాకేజీ- 29లో రూ.546 కోట్లకు రూ.111 కోట్ల వ్యయం ఖర్చుచేసి, 20శాతం పని మాత్రమే చేశారన్నారు. ప్యాకేజీ 30లో 55శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. ఇక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లకు టెండర్లు పిలవలేదని, కరెంట్‌ పనులు ఆరంభం కాలేదని తెలిపారు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు విషయానికొస్తే ఈ ఏడాది నవంబర్‌లో పూర్తికావాల్సి ఉన్నప్పటికీ 48.70 శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. రూ.12.30 కోట్లు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. స్టేజ్‌-2లో రూ.8కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అదే విధంగా భీమా విషయానికొస్తే జూన్‌ మాసానికి పూర్తికావాల్సి ఉన్నప్పటికీ 50-70శాతం మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు బిల్లులు రూ.35కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఇలా బిల్లులు చెల్లించకపోవడం వల్ల ప్రాజెక్టుల పనులన్నీ ఆరు నెలలుగా నిలిచిపోయాయన్నారు. ఎన్నికలయ్యాక మా ప్రభుత్వం రాదు టీడీపీ వాళ్లే చూసుకుంటారులే అని బిల్లులు చెల్లించకుండా ఉన్నారేమో అని ఎద్దేవా చేశారు. పులివెందుల ప్రాజెక్టులకు ఎందుకు బిల్లులు చెల్లించారు? పాలమూరు ప్రాజెక్టులేం పాపం చేశాయని ఆయన ప్రశ్నించారు.

వైఎస్‌ సవతితల్లి ప్రేమకు ఇది నిదర్శనమని, ఇకనైనా పెండింగ్‌ బిల్లులు చెల్లించి ప్రాజెక్టులు ముందుకు సాగేలా చూడాలని డిమాండ్‌చేశారు. బిల్లులు చెల్లించడం ఆలస్యమైతే ప్రాజెక్టుల వ్యయం పెరుగుతుందని ఆయన అన్నారు. ఇటీవల పాలమూరు ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహిస్తే ఇక పనులు ప్రారంభంఅవు తాయని భావించామన్నారు. అయితే అది ఉత్తి సమీక్షే అని తేలిందన్నారు. భూసేకరణ, ఇసుక వల్ల జాప్యం జరుగుతుందని కుంటిసాకులు చెబుతున్నప్పటికీ, గత ఏడాది జూరాలలో నీరులేక మంచినీటికి సైతం ఇబ్బందులనెదుర్కొన్న పరిస్థితులను విస్మరించినట్లున్నారన్నారు. ప్రాజెక్టులు నిర్మించి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల సామర్ధ్యం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్‌లో కోట్లాదిరూపాయలు కేటాయించి ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ఆయన దుయ్యబట్టారు.

ఇక నాలుగో లిఫ్ట్‌ ఇంటికెళ్లిందని, అందుకే కల్వకుర్తిలో ఎడ్మ ఇంటికెళ్లారన్నారు. అచ్చంపేట, నాగర్‌కర్నూలు నియోజకవర్గాల్లో తన హయాంలో 132 గ్రామాలకు మంచినీటి సరఫరాకు ఏర్పాటు చేశానన్నారు. అప్పటి జిల్లా మంత్రి 52గ్రామాలలో ఆ పథకాన్ని ఎత్తివేశారన్నారు. చివరకు ప్రజలు ఆయనను ఎత్తివేశారని చిన్నారెడ్డినుద్దేశించి ఆరోపించారు. సహకరించి జిల్లాను అభివృద్ధి చేద్దాం: జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సహకరిస్తారని నాగం ఈ సందర్భంగా అన్నారు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా: జిల్లాలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని నాగం చెప్పారు. జిల్లా ప్రజలు టీడీపీ పై విశ్వాసముంచి అత్యధిక ఎమ్మెల్యేలను గెలిపించినందుకు వారి ఆరోగ్య భద్రత, అభివృద్ధి విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు.

జిల్లాలో నాగం జోక్యంతో రెండు అసెంబ్లీస్థానాలు కోల్పోయాయనే ఆరోపణలున్నాయని ప్రశ్నించగా అందరినీ కలుపుకొనిపోయాం. ఎవరైనా అలా అనుకుంటే ఏమీ అనుకోననని ఆయన సమాధానమిచ్చారు. అలంపూర్‌లో అయిజ మండలంలో ఓటింగ్‌ కాకపోవడం, వడ్డేపల్లిలో లీడ్‌ తగ్గడం, కొల్లాపూర్‌లో స్వతంత్ర అభ్యర్థి టీడీపీ ఓట్లను భారీగా చీల్చడం వల్ల ఓటమికి దారి తీసిందన్నారు. గద్వాలలో తమ పార్టీ అభ్యర్థి సమర్థుడైన వ్యక్తేనన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్‌, పార్టీ నాయకులు విజయసారథిరెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.