(డాక్టర్ కొత్తింటి సునంద)
‘అత్యాచారం’ అనేది మనం అనునిత్యం వినే వార్తలలో ఒక భాగమై పోయింది. అత్యాచారం జరిగింది అని తెలిసిన వెంటనే మనవాళ్ళు కొందరు, వెంటనే ‘ఆ పిల్ల ఎట్లాంటిదో ఏమొ? ఎట్లాంటి బట్టలేసుకొంటుందో ఏమొ? యడాడ తిరుగుతుందో ఏమొ?’ అని వ్యాఖ్యానాలు చేయడం, ఆ వెనువెంటనే ‘’వాడిని మా పిల్లల జోలికి రమ్మను, మా పిల్ల నిప్పు… తాకిన వాడిని కాల్చిపారేస్తుంది. మేము మా పిల్లలని కట్టుబాటులో పెంచుతున్నామండి. ఆ తిరుగుళ్ళు అవీ మా పిల్లలకు లేనేలేవు’’ అని గర్వంగా చెప్తూ వుంటారు. దురదృష్టవశాత్తూ ఆమ్మాయే అత్యాచారానికి గురి అవుతుందనుకోండి. అత్యాచారం చేసినవాడిపై తిట్లు, శాపనార్థాలు కురిపిస్తారు. అప్పుడుగాని అమ్మాయిల జీవితాలు ఎంత భేద్యమైనవో (vulnerable) వాళ్ళకర్థం కాదు. సాంఘికంగా మనకంటే ఎంతో ముందున్న ‘సోకాల్డ్ డెవలప్‌డ్ కంట్రీ’ లలో కూడ ఇటువంటి అభిప్రాయలు కలిగినవాళ్ళు ఈనాటికీ వున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. july 26 (2008) The Hindu లొజూలీ బిండెల్ రాసిన వ్యాసం ‘Rape – there is never an execuse, ever వ్యాసం చదివితే, యూరప్‌లోని కొన్నిదేశాలలో అత్యాచారాల గురించి చేసిన సర్వేలలో ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయలు, వాటిని జ్యూలీ బిండెల్ తీవ్రంగా నిరసించడం, ఖండించడం మనకు తెలుస్తుంది. 1999లో జరిగిన ఒక అత్యాచారం కేసులో యూరప్‌లో డిఫెన్సు లాయరు అత్యాచారం జరిగిందని చెప్తున్న సమయంలో ఆ స్త్రీ ఒంటికి అతుక్కొని వుండే బిగుతైన జీన్సు ప్యాంటు వేసికొని వుంది. ఆ స్త్రీ సహాయం లేకుండ పురుషుడికి అత్యాచారం చేయడం అసంభవం అని వాదించారట. అంతకు మునుపు దోషిగా నిలబెట్టిన నిందితుడిని, న్యాయధీశులు డిఫెన్సు వాదననంగీకరించి, నిర్దోషిగా విడుదల చేసారంట. ఇక అప్పటినుండి దాదాపు పది సంవత్సరాలు నిరాటంకంగా అత్యాచారానికి పాల్పడ్డ ప్రతీ మగవాడు అతని లాయరు, జడ్జీలు – అందరు ఆ ఆర్గ్యుమెంటునే వాడుకొ౦టూ, బలపరుస్తూ తప్పించుకొంట, తప్పింపచేస్తూ వస్తున్నారంట. ఈ వాదం ఎలా వుందంటే పూర్వం అమ్మమ్మల కాలంలో కాళ్ళు రెండూ గట్టిగా పెనవేసుకు కూచో, అత్యాచారం చేయలేరు అన్నట్లుంది అంటారు జ్యూలీ బిండెల్. ఈ వాదాన్ని తిప్పికొట్టేందుకు స్త్రీవాద ఉద్యమానికి పదేళ్ళు పట్టింది. కాని దానికి బ్రేకు పడింది మొన్నీ మధ్య జరిగిన ఒక కేసు విచారణలో. 45 వయస్సులో వున్న ఒక మగవాడు 16 ఏళ్ళ వయస్సులో వున్న తన పార్టనర్ కూతురికి డ్రైవింగు నేర్పిస్తున్న సమయంలో, ఆ అమాయి ప్యాంటు ముందుభాగంలో చేతులు జొనిపి అత్యాచారం చేయబోయడని ఆరోపణ. ‘ఆ అమ్మాయి బిగుతైన ప్యాంటు వేసుకొని వుంది. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా నేనెలా ఆ పని చేయగలను. ఆమె యిష్ట ప్రకారమే జరిగింది, అని పాతపాటే పాడారంట ఆ నిందితుడు ప్లస్ అతడి లాయరు. కాని ఈసారి జడ్జీలు దానికి ఒప్పుకోలేదు. ‘జీన్స్ ప్యాంటేమీ చేస్టిటీ బెల్టు’ (chestity belt) కాదు అని అతడికి శిక్ష విధించారంట. ఇది ఇటలీలో జరిగింది. యూరప్‌లోని చాలా దేశాలలోని ప్రజలు – అత్యాచారానికి కారకురాలు స్త్రీ అనీ ఆమె వస్త్రధారణ, ఆమె ప్రవర్తన, ఆమె తాగుడు అని స్త్రీని బాధితురాలిగ కాకుండ నిందితురాలిగా చూసే బ్లేమ్ కల్చర్ (blame culture) అంటే స్త్రీపై నిందారోపణ చేసే ఆచారం ప్రబలంగా వుందని జ్యూలీ బిండెల్ చెప్తారు. ఆమ్నెస్టీ ఇంటర్‌నేషనల్ పోయినేడాది జరిపిన సర్వేలో ప్రశ్నలకు జవాబులిచ్చిన వారిలో పావువంతుమంది అత్యాచారానికి కొంతవరకో, పూర్తిగానో స్త్రీదే బాధ్యత అని చెప్పారట. ఆమె శరీరాన్ని బట్టబయలు చేసే బట్టలు వేసుకొంటుంది కనుక ఆమే కారణం అన్నారంట. ఐర్లెండులో జరిపిన సర్వేలో కూడ వెయ్యిలో 40% అత్యాచారానికి స్త్రీల ప్రవర్తన, వారి అంగాంగ ప్రదర్శనే కారణమని చెప్పారట. ఇంగ్లండు, వేల్స్ దేశాలకు సంబంధించిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టరు కెన్ వక్ డొనాల్డ్ (cane mac donald) ‘గార్డియన్’ అనే పత్రికకు ఇంచుమించు ఇటువంటి అభిప్రాయన్నే వెలిబుచ్చారట – స్త్రీల విచ్చలవిడితనం, తాగుడు వంటివే అత్యాచారాలకు దారితీస్తున్నాయని స్కాట్లండుకు (scotland) చెందిన ఒక సీనియరువెస్టు లాయరు డొనాల్డ్ ఫిండ్లే (donald findlay) ధోరణి కూడ ఇదే. అత్యాచారాల కేసులు విచారణ చేస్తున్న సమయంలో కోర్టు జాగ్రత్తగా వుండాలని, పదహారేళ్ళ లోపు అమ్మాయిలను ‘అమాయకుల’నుకోనవసరం లేదని, తనకు 23 ఏళ్ళ వయసులో సెక్సు గురించి తెలిసినదానికంటే ఇప్పటి పదమూడేళ్ళ అమ్మాయికెక్కువ తెలుసని అసలు అత్యాచార సమయంలో అమ్మాయి ఎటువంటి బట్టలు వేసుకొని వుందో గమనించడం ముఖ్యమని హెచ్చరించారట కూడాను. పురుషులు తమపై ఆరోపింపబడిన అత్యాచార నేరాన్ని తప్పించుకోడానికి ఇంకొక అస్త్రాన్ని కూడ తరచు వాడుతుంటారు. స్త్రీ తన సైగల ద్వారా, సంకేతాల ద్వారా రమ్మని పిలిచినందునే లేదా అంగీకారం తెలిపినందునే మేము ఆవిడ జోలికి వెళ్ళాము అని. జ్యూలీ బిండెల్ ఈ వాదాన్ని కూడా తీవ్రంగా గర్హిస్త, స్త్రీ అంగీకారం తెలిపిందో, అనంగీకారం తెలిపిందో కూడ తెలుసుకోలేనంత అమాయకులేమీ కారు మగవారు అని ఖండించారు. కాని ఎక్కువ శాతం మగవారు ఈ వాదనను వాడుకోడం, అంతకంటె ఎక్కువ శాతం దానిని సమర్థించడమూ జరుగుతునే వుందింకా. సౌత్ ఆఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌లో, ఫిబ్రవరి నెలలో మినీస్కర్టులు (పొట్టి పావడలు) ధరించిన నలుగురమ్మాయిలను కొందరు మగవారు ట్యాక్సీస్టాండులో లైంగిక వేధింపులకు గురిచేశారు. ఆ స్త్రీలను వివస్త్రలను చేసి వారిని నగ్నంగా వూరేగించారట. పైపెచ్చు ఆ మగధీరులు, దారినే పోతున్నవారిని పిలిచి మరీ ‘చూడండి, చూడండి వీరు కోరుకొన్నదే మేము చేశాము’ అని కేక వేశారట. ఎంత దారుణం. ఒక్కొక్కసారి స్త్రీల శీలాన్ని గురించి, పవిత్రతను గురించి వీరావేశంతో మాట్లాడేవారే అత్యాచారాల కొడిగడుత వుంటారని జ్యూలీ బిండెల్ రాశారు. నైజీరియలోని ఒక సెనేటర్ అత్యాచారాల సంఖ్యను తగ్గించే ఉద్యమంలో భాగంగ ఒక ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టాలను కొన్నాడట. అదేమంటే స్త్రీలు తమ వక్షోజాలను, ఛాతీ, పొట్ట భాగాలను కనిపించే విధంగా బట్టలేసుకొని బహిరంగ ప్రదేశాలలో తిరిగితే వారికి మూడునెలల జైలుశిక్ష విధించాలి అని. పోలెండులోని ఇంకొక లెజిస్లేటరు స్త్రీలు పొట్టిపావడలను బహిష్కరించాలని పిలుపునిచ్చారట. నార్త్ మలేషియలోని ఒక నగర కౌన్సిలు వారు తమ హుందాతనాన్ని కాపాడుకొనేందుకు, అత్యాచారాలను, అశ్లీల శృంగారాన్ని అరికట్టేందుకు స్త్రీలు ఎత్తుమడమల జోళ్ళను, లిప్‌స్టిక్కు వాడకాన్ని నిషేధించాలని ఆదేశించారట. బురఖా ధరించని స్త్రీలు తమంతట తాము అత్యాచారాలను ఆహ్వానించినట్లు అర్థమని కొందరు మతపెద్దల అభిప్రాయమంట. ఆస్ట్రేలియకు చెందిన ఒక సీనియర్ మతపెద్ద షేక్ తాజుద్దీన్ అల్ హిలాలి ఒక ప్రసంగంలో ఇలా అన్నారట. ‘’పచ్చిమా౦సం ఏ విధంగ వేటాడే జంతువుల నాకర్షిస్తుందో అదే విధంగా బురఖా వేసుకోని స్త్రీ మగవాడిని ఆకర్షిస్తుంది’’ – జ్యూలీ బిండెల్ సూటిగ ఒక ప్రశ్ననిక్కడ అడుగుతారు. స్త్రీ తన కాళ్ళు, చేతులు కనపడే విధంగ బట్టలు వేసుకొన్నంత ొమాత్రాన, మగవారెవరైనా తనను సెక్సులోకి లాగొచ్చని సంకేతమిచ్చినట్లు అర్థమా? బలవంతంగానైనా సరే తమను అనుభవించవచ్చునని చెప్పినట్లు లెక్కకాదు అంటారు జ్యూలీ. 2006లో బ్రిటన్‌లో economic and social research council వారొక ప్రాజెక్టును చేపట్టారు. అందులో భాగంగా mock jury trials – నకిలీ న్యాయసమితి విచారణలు చేపట్టారు. ఒక నివేదిక తయరు చేశారు. దానిలో ఒక (juror) న్యాయవేత్త స్త్రీ సహకరించనిదే ఈ పురుషుడు స్త్రీని చెరచడంగాని, కామక్రీడ నిర్వహించడం గాని వీలుకాదు. అతడు ఆమెను గట్టిగా కొడితే తప్ప సాధ్యం కాదు. స్త్రీ శరీరం మీద గాట్లు, దెబ్బల గుర్తులు లేకపోయినట్లయితే ఆ స్త్రీ సహకరించినట్లే లెక్క అని ఆయన ఉవాచ. జ్యూలీ బిండెల్ మనలను ఇలా అడుగుతున్నారు. ఇదంతా విన్న తరువాత మీకు సమస్య పూర్తిగ అర్థమయ్యే వుంటుంది. అయితే మనమేమి చేద్దాం? శరీరన్నంతటిని కవచం కప్పుకొని తిరుగుదామా? ఆయుధాలు ధరించుదామా? లేదా బయటికి వెళ్ళకుండ వనేద్దామా? – అసలటువంటి ఆలోచనలకే తావీయనవసరం లేదంటారు జ్యూలీ. ఏ.చ. ప్రభుత్వం ఒక పక్క అత్యాచారాల కేసులలో సరిగా శిక్షలు పడడం లేదని వాపోతనే ఇంకొక పక్క తనను రక్షించుకొనే బాధ్యత స్త్రీలదే అని చెపుతోంది. ఈ విధంగా కాకుండ మనం స్కాట్లాండులో ‘rape crisis scotland’ వారు చేపట్టిన కార్యక్రమాన్ని అనుసరిద్దాం. అత్యాచారాలకు స్త్రీలే కారకులు అనే వాదనను ఖండించి, సవాలు చేద్దాం. పోస్టర్లు అతికిద్దాం. కరపత్రాలు పంచిపెడదాం. స్కాట్లాండు న్యాయకార్యదర్శి ఈ కాలంలో కూడ పాతవాదన – స్త్రీలే అత్యాచారాలకు కారకులు అనే వాదన చేసేవాళ్ళున్నారంటే నమ్మశక్యం కాదు అంటారు. స్త్రీవాదులు దశాబ్దాలుగా ఈ వాదనని తప్పని మొత్తుకొంటున్నా, ఎంతమంది వారి మాటలకు ప్రభావితులైనారు? ఎందుచేత ఎక్కువమందిలో మార్పు రాలేదు? ఏదేమైనా ‘rape is sex without consent’ – అత్యాచారం యిష్టంలేని, అనంగీకారమైన కామక్రీడ అని జ్యూలీ గట్టిగ చెప్తున్నారు. ఇందులో అర్థం కాని అంశమే ముందసలు అని నిలదీస్తారు. యూరప్ దేశాలలో కాముకులు ‘బిగుతైన జీన్స్ ప్యాంటు’ వాదనడ్డం పెట్టుకొని తప్పించుకో చశారు. మరి మనదేశం మాటో 1. అభం శుభం ఎరుగని, ముక్కుపచ్చలారని మూడేళ్ళపాప ఏ విధంగ మగవాడిని సెక్సుకు ప్రోత్సహిస్తుంది? తన వస్త్రధారణతోనా? ప్రవర్తనతోనా? 2. మొరటు చీర కట్టుకొని, చింకి జుట్టును కొప్పులో బిగించి పొలాలలో బండపనులు చేసే గ్రామీణ రైతు కూలీ ఏ విధంగా పురుషులలో కావెద్దీపన కలిగిస్తుంది? తన అర్థాకలి చూపులతోనా? బురద కొట్టుకొన్న కాళ్ళు చేతులతోనా? 3. మన ఇళ్ళల్లో పనిచేసే పనిమనిషి – ఏ విధంగా ఆ యింటి మగవారిని సెక్సుకు పురికొల్పుతుంది? ఊడ్చే భంగిమతోనా! చేతికంటిన జిడ్డు మరకలతోనా? 4. పాఠశాలల్లో, కాలేజీల్లో చదివే విద్యార్థిని ఏమిచేసి తన ఉపాధ్యాయునిలో తనపై కామవాంఛ రేపుతుంది? అర్థం కాని పాఠాలను వివరించమని అడిగి విసిగించడం వల్లనా! సరియైన జవాబులు చెప్పి ఆనందింపచేయడం వల్లనా! 5. ’నాన్నా అది కొనివ్వు, ఇది కొనివ్వు’ అని నాన్న ఒళ్ళో కూర్చొని గారాలు పోయిన చిన్నారి చిట్టితల్లి యుక్తవయస్సుకు రాగానే ఆ తండ్రిలో కావెద్దీపన ఏ విధంగా కలగచేస్తుంది? తన పెద్దన్నను సెక్స్‌కు ఎలా పురికొలుపుతుంది? 6.తాను తాగడం అట్లుంచి… ‘బాబ నీవు తాగి వున్నావు నీకు మద్యంతో పాటు మా౦సము మగువ కూడ అవసరము. రా! నన్నందుకో అనుభవించు’ అని ఏ స్త్రీ చెప్తుంది. రాస్తూ పోతే లిస్టు పెరిగిపోవడమే తప్ప… దీనికి అంతపొంత కనపడడం లేదు. కనుక నేను చెప్పేది ఒకటే. ఆలోచించండి, అర్థం చేసుకోండి, అమలులో పెట్టండి. అవసరమైన చోట ధిక్కరించండి, ఎదురు నిలబడి పోరాడండి. గత్యంతరం లేదు.
Filed under: వార్తలు




